: గోదావరి జిల్లా అతి తెలివి తన దగ్గర చూపొద్దన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
"గోదావరి జిల్లా అతి తెలివిని నా దగ్గర చూపించొద్దు. నేను కూడా ఇక్కడి కోడలినే" అని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ పొగాకు రైతులను ఉద్దేశించి ఒకింత కటువుగా మాట్లాడారు. మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి బాబులతో కలిసి పొగాకు రైతులతో ఆమె సమావేశమైన వేళ ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పొగాకును పండించే నిమిత్తం రైతులకు ఇచ్చిన పర్మిట్ లను వెనక్కు ఇచ్చేయాలని ఆమె కోరగా, ఎకరానికి రూ. 8 లక్షలను రైతులు డిమాండ్ చేశారు. అంత ఇచ్చే బడ్జెట్ తన వద్ద లేదని నిర్మల వెల్లడించగా, పోలవరం ప్రాజెక్టులో ఎకరానికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారని రైతులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె, "గోదావరి అతి తెలివి అంటే ఇదే. వారు భూములను కోల్పోయారు. మీ భూములు మీదగ్గరే ఉంటాయి" అని చెబుతూ, ఇలాంటి తెలివి తన వద్ద చూపొద్దని హెచ్చరించారు. దీంతో వాతావరణం వేడెక్కడంతో, సుజనా కల్పించుకుని కనీసం ఎకరం పర్మిట్ కు రూ. 5 లక్షల వరకన్నా ఇప్పించాలని కోరారు.