: అమరావతిలో మాయం కానున్న ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం... చదును చేస్తారన్న వార్తలతో భయాందోళనల్లో గ్రామస్తులు!
అమరావతి ప్రాంతంలో స్టార్టప్ అభివృద్ధి నిమిత్తం మూడు ప్రైవేటు సంస్థలకు 1,691 ఎకరాలను అప్పగించాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కారు, అందులో భాగంగా ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలను పూర్తిగా నేలమట్టం చేసి, ఆపై చదును చేయాలని భావిస్తోందని వార్తలు వస్తుండటంతో, రెండు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. తాము పొలాలను రాజధాని నిమిత్తం ఇచ్చామని, ఇప్పుడు తమ ఇళ్లను లాక్కోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో 3,057 మంది 792 ఇళ్లలో నివసిస్తుండగా, 6 గుడులు, 7 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూల్చి, చదును చేసి ఏడీపీ, జీవీసీ, సీసీడీఎంసీఎల్ కంపెనీలకు ఇచ్చి అభివృద్ధి చేయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. రాజధాని ఎక్కడన్న విషయం అధికారికంగా చెప్పిన తరువాత, ఈ ప్రాంతపు భూములకు రెక్కలు రాగా, చాలా మంది కొంత భాగాన్ని అమ్మి, ఆపై లక్షలు ఖర్చు చేసి తమ ఇళ్లను అందంగా పునర్నిర్మించుకున్న వాళ్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు తమ ఇళ్లను ఎక్కడ ఖాళీ చేయాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.