: ఇప్పటికి పంజాబ్, గోవాలు చాలు... యూపీ అసెంబ్లీకి పోటీ పడరాదని నిర్ణయించిన ఆప్!


వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడరాదని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని 15 పెద్ద నగరాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని భావిస్తోంది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో సమావేశమైన నేతలు, 2017లో జరిగే పంజాబ్, గోవా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించారు. "యూపీ ఎన్నికల్లో పోటీ చేయరాదని, మునిసిపల్ ఎన్నికలను వదలకూడదని నిర్ణయించాం. 15 నగరాల్లో జరిగే ఎన్నికలకు పోటీపడతాం. ఇందులో ఆరు నగరాలు పశ్చిమ యూపీలో ఉన్నాయి. అక్కడ మాకు మంచి బలముంది" అని ఆప్ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో తమకు మంచి విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. తమది చాలా చిన్న పార్టీ అని, వనరులు సైతం తక్కువేనని వెల్లడించిన ఆయన, ఒకేసారి అధిక రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టిని సారించలేమనే, ఈసారికి యూపీని వదిలి పెడుతున్నామని వివరించారు. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో తమ నేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News