: నలుగురు టీచర్ల బదిలీలను నిలుపుదల చేయించిన విద్యార్థి!
ఓ విద్యార్థి ప్రదర్శించిన చొరవ, ధైర్యం కారణంగా నలుగురు ఉపాధ్యాయుల బదిలీని నిలిపివేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... దక్షిణ కన్నడ జిల్లా హరది గ్రామంలోని మోడల్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఉపాధ్యాయులను ఒకేసారి ఉన్నతాధికారులు వేరే చోటుకి బదిలీ చేశారు. దీంతో స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఎనిమిదో తరగతి విద్యార్థి దివిత్ రాయ్ తన తండ్రి సెల్ ఫోన్ నుంచి రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వరకు 'మా స్కూల్ కౌన్సిల్ కు నేను హోంమంత్రిని, దయచేసి మీతో మాట్లాడటానికి ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించగలరా?' అంటూ ఎస్ఎంఎస్ పంపించాడు. దానిని చూసిన హోం మంత్రి పిల్లాడికి ఫోన్ చేశారు. అతను చెప్పిందంతా శ్రద్ధగా విని చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చారు. కొన్ని రోజుల తరువాత దివిత్ కొరిక మేరకు విద్యాశాఖా మంత్రి టీచర్ల బదిలీలు నిలపేశారని చెబుతూ విద్యాశాఖాధికారుల నుంచి దివిత్ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ధైర్యంగా తమ సమస్యను వినిపించిన దివిత్ ను ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సయత్ అభినందించారు. అంతేకాదు, ఆ స్కూలుకు మరికొందరు ఉపాధ్యాయులను నియమించేందుకు ఉత్తర్వులు ఇచ్చామని కూడా తెలిపారు.