: కోహ్లీదా? అశ్విన్ దా? ఎవరి ఇన్నింగ్స్ గొప్పది?
వెస్టిండీస్ లో నిర్జీవమైన పిచ్ పై ఆడుతున్న వేళ ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటి అద్భుతమైన ఆటతీరుతో జట్టును పటిష్ఠ స్థితిలోకి నిలబెట్టారు. ఈ నేపథ్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో విదేశాల్లో తొలి డబుల్ టన్ సాధించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. దీంతో కోహ్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫాంలో ఉన్న కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడం ప్రత్యేకమే అయినప్పటికీ, అది అసాధ్యమైన విషయమేమీ కాదన్నది జగమెరిగిన సత్యం. బౌలర్లకు పిచ్ సహకరించని వేళ కోహ్లీ లాంటి ఆటగాడు కాస్త నిలదొక్కుకుని ఉంటే పరుగుల వరద పారుతుందన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆరంభంలో 241 నిమిషాలపాటు క్రీజులో నిలదొక్కుకుని 147 పదునైన బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన ధావన్ ప్రతిభ దీని ముందు చిన్నబోయింది. మరీ ముఖ్యంగా 340 నిమిషాలపాటు క్రీజులో నిలదొక్కుకుని డబుల్ సెంచరీ చేసిన కోహ్లీకి (283 బంతులు) దీటుగా 253 బంతులు ఎదుర్కొని 113 పరుగులు చేసి టెస్టు మజాను రుచి చూపిన బౌలర్ రవి చంద్రన్ అశ్విన్ ప్రతిభను ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యమేస్తుంది. ఆల్ రౌండర్ అయినప్పటికీ జట్టులో స్పిన్నర్ గా స్థానం దక్కించుకున్న అశ్విన్ లోయర్ ఆర్డర్ లో టీమిండియాకు ఉపయుక్తమైన బ్యాట్స్ మన్. జట్టుకు అవసరం అనుకున్న వేళ బ్యాటుతో సత్తా చూపగల అశ్విన్ విండీస్ లో సెంచరీ చేయడం చిన్న విషయం కాదు. మురళీ విజయ్, పుజారా, రహానే వంటి బ్యాట్స్ మన్ నిలదొక్కుకోని పరిస్థితుల్లో కోహ్లీకి అతను అండగా నిలిచిన తీరు అనితర సాధ్యం. ఒక రకంగా చూస్తే...అశ్విన్ సాధించిన సెంచరీ విరాట్ కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీ కంటే గొప్పదనడం కూడా అతిశయోక్తి కాబోదు!