: కశ్మీర్‌కు చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్... ఉన్నత స్థాయి సమావేశం
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని ఎన్‌కౌంటర్ చేసిన తరువాత కశ్మీర్ కల్లోలంగా మారిన సంగతి తెలిసిందే. అక్కడి పరిస్థితులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు ఎంతగా ప్రయత్నిస్తోన్నా ఉద్రిక్త వాతావరణం ఇంకా చల్లారలేదు. ఇప్పటికి 3,000 మంది పారామిలటరీ దళాలను కేంద్రం కశ్మీరుకు పంపింది. అయినప్పటికీ నిన్న కూడా ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా అవంతిపొరా ప్రాంతంలో మరోసారి అల్లర్లు చెలరేగడంతో బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కశ్మీర్‌లో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన కశ్మీర్ చేరుకున్నారు. వెంటనే ఆయన పారా మిలిటరీ డైరెక్టర్ జనరల్, సీఆర్పీఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ సిబ్బందిని కలిశారు. కొద్ది సేపట్లో ఆయన ఉన్నత స్థాయి భద్రతా సమావేశంలో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ నరేందర్ నాథ్ వొహ్రాలతోనూ భేటీ అవుతారు. రేపు మధ్యాహ్నానికి ఆయన తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.