: నేను, నా కుమారుడు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నామని బీజేపీ అంటోంది: దిగ్విజయ్
మధ్యప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తన పేరును, తన సోదరుడు, తన కుమారుడి పేర్లను బీపీఎల్ జాబితాలో చేర్చాయని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. తమ కుటుంబం ఆదాయ పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశంతో ఇలా చేశాయని ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బీపీఎల్ జాబితాలో చేర్చమని తామెన్నడూ దరఖాస్తు చేయలేదని, అయినా సరే తమను బీపీఎల్ జాబితాలో చేర్చారని, ఇది తమ కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చడమేనని, ఇందుకు బాధ్యులైన వారు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.