: అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం ఐసిస్‌కు మద్దతిస్తోంది: శివసేన ఎమ్మెల్యే
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌కు మద్దతు ఇస్తోందని, తక్షణమే ఆ పార్టీ గుర్తింపును రద్దుచేయాలని శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో కోరారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం నుంచి వందమంది ముస్లిం యువకులు అదృశ్యమయ్యారని, వారంతా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మరాఠ్వాడాలోని పర్బానీ ప్రాంతంలో ఇటీవల అరెస్టయిన యువకులకు ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అదృశ్యమైన యువకులు ఐఎస్ఐఎస్‌లో చేరి ఉండొచ్చన్న అనుమానాన్ని పోలీసులు సైతం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే పాటిల్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పటాన్ కొట్టిపడేశారు. అవి నిరాధార ఆరోపణలని తేల్చిచెప్పారు. తాము ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు.