: రేణుకా చౌదరి, జైరాం రమేశ్ అనుచిత వర్తన!... కేంద్ర మహిళా మంత్రిని ‘కచ్రా’అంటూ మాటల దాడి!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుపై నిన్న రాజ్యసభలో ఓటింగే జరగలేదు. అధికార బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ బిల్లుపై ఓటింగ్ ను అడ్డుకుని సభను అర్థాంతరంగా వాయిదా వేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, జైరాం రమేశ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అకాలీదళ మహిళా ఎంపీ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ పై వారిద్దరూ విరుచుకుపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే బిల్లుపై ఓటింగ్ ను అడ్డుకున్నారంటూ ఆరోపించిన రేణుకా, జైరాంలు... తమకు దగ్గరగా ఉన్న సిమ్రత్ పై మండిపడ్డారు. హర్ సిమ్రత్ ను వారిద్దరూ ‘కచ్రా’గా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల హర్ సిమ్రత్ అభ్యంతరం వ్యక్తం చేసినా రేణుక ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో మనసు నొచ్చుకున్న హర్ సిమ్రత్ రేణుక, జైరాంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తానని ప్రకటించారు.