: అది బీజేపీ, టీడీపీల అవగాహనా రాహిత్యం!: చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా అంశం లేదని చెప్పడం బీజేపీ, టీడీపీల అవగాహనా రాహిత్యమని సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రత్యేకహోదా ఇచ్చిన సందర్భంలో ఏ చట్టాలు చేయలేదని అన్నారు. అవగాహన లేని బీజేపీ, టీడీపీలు చట్టంలో ఈ విషయం లేదని చెబుతున్నాయని, కేబినెట్ భేటీలో చర్చించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తే సరిపోతుందని, లోక్ సభలో మెజారిటీ బీజేపీకి ఉందని, రాజ్యసభలో కాంగ్రెస్ మద్దతిస్తుందని, అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడంలో టీడీపీ, బీజేపీలకు వచ్చిన కష్టమేంటని ఆయన నిలదీశారు. ప్రత్యేకహోదా బిల్లు ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజు ఓటింగ్ కు రావాల్సిందేనని, ఆ రోజైనా సమాధానం చెప్పాల్సిందేనని, ఈ దాగుడు మూతలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.