: అవును, ముమ్మాటికీ రాజకీయమే...కాదని ఎవరైనా చెప్పగలరా?: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లుపై ఓటింగ్ కు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడం రాజకీయమని బీజేపీ, టీడీపీలు పేర్కొనడాన్ని కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. ఢిల్లీలో రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ నేతలు చెబుతున్నట్టు కాంగ్రెస్ రాజకీయం చేస్తే... ఆ రెండు పార్టీలు చేసేవి ఏంటని నిలదీశారు. మనం ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందని అనుకుని, ప్రజలను వెర్రివాళ్లను చేయవద్దని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా బిల్లు చుట్టూ చోటుచేసుకున్నవన్నీ రాజకీయ ప్రయోజనాలేనని ఆయన స్పష్టం చేశారు. అలా కాదు అని టీడీపీ, బీజేపీ చెప్పి, తమకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పే పక్షంలో ఇఫ్పటికిప్పుడు ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ప్రధాని ముందుకు వెళ్లి ఆందోళనకు దిగి హోదా ప్రకటించేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీల నేతలు మాట్లాడే మాటలు వింటే ఎవరు రాజకీయం చేస్తున్నారో, ఎవరు ప్రజల కోసం పోరాడుతున్నారో తెలుస్తుందని ఆయన తెలిపారు. తప్పులు జరిగిపోయాయి... వాటిపై విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీ ప్రయోజనాలు పెరుగుతాయేమో కానీ, ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఉండదని అన్నారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా పార్టీలకతీతంగా పని చేయకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. అలా పని చేయని రోజున ప్రతి రాజకీయనాయకుడిని ప్రజలు తరిమికొట్టేరోజు ఎంతో దూరంలో లేదని ఆయన తెలిపారు.