: ఇది సినిమా కాదు నిజం!... సామాన్యుల కష్టాలు తెలుసుకోమని కొడుకును నెల రోజుల పాటు ఇంటి నుంచి బయటకు పంపిన కోటీశ్వరుడు!
బిలియనీర్ తండ్రులు తమ పిల్లలకి డబ్బు విలువ తెలియాలని చెప్పి, కొన్ని షరుతులు విధించి, ఇంటి నుంచి బయటకు పంపేసి కష్టపడి సంపాదించి చూపించమని ఆదేశించడం అప్పుడప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలోనూ అటువంటి సంఘటనే ఇప్పుడు గుజరాత్లో జరిగింది. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలకియా ఎంబీఏ చదువుతోన్న తన కుమారుడు ద్రావ్య(21)కి పలు షరతులు విధించి ఇంటి నుంచి బయటకి పంపించాడు. అమెరికాలో చదువుకుంటోన్న ద్రావ్య నెలరోజులు సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన సమయంలో అతని తండ్రి ఈ పరీక్ష పెట్టాడు. బయట ఉద్యోగాలు, చేతిలో డబ్బు లేక సామాన్యులు ఎలా కష్టపడుతున్నారో తన కొడుకు కూడా స్వయంగా తెలుసుకోవాలని ఆయన ఈ పనిచేశాడు. 30రోజుల పాటు తన కొడుకుని సామాన్యుడిలా జీవించమని, గతనెల 21న తన కుమారుడికి మూడు జతల బట్టలు, రూ.7 వేలు ఇచ్చి ఇంటి నుంచి పంపించాడు సదరు బిలియనీర్. తానిచ్చిన ఏడు వేల రూపాయలు కూడా అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని సూచించాడు. ఫోన్ కూడా వినియోగించరాదని చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ద్రావ్య పనిని వెతుక్కుంటూ మొదట ఓ బేకరిలో చేరాడు. ఆ తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెల్డొనాల్డ్ అవుట్లెట్ లో పనిచేసుకున్నాడు. 30 రోజుల్లో రూ.4 వేలకు పైగా సంపాదించి ఇటీవలే ఇంటికి వచ్చాడు. తాను ఇంటి నుంచి వెళ్లాక మొదటి ఐదు రోజులు తనకు ఎక్కడా పనిదొరకలేదని ద్రావ్య చెప్పాడు. పనికోసం 60 చోట్లకు వెళ్లినట్లు పేర్కొన్నాడు. తానెవరో తెలియక మొదట తనకు ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదని తెలిపాడు. ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని తనకు తెలిసొచ్చిందని చెప్పాడు. తాను ప్రతీరోజు సంపాదించిన దాంట్లో రూ.40తో ఆహారం కొనుక్కొని తినేవాడినని, తాను బసచేసిన లాడ్జికి రోజుకు రూ.250 చెల్లించానని పేర్కొన్నాడు. ద్రావ్య తండ్రి మాట్లాడుతూ.. సామాన్యులు పడుతున్న బాధలను గురించి తన కుమారుడికి తెలియజెప్పాలనే ఇలా చేశానని అన్నాడు. ఇటువంటి పాఠాలు ఏ విద్యాలయాల్లోనూ బోధించబోరని, తన కుమారుడు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఇలాంటి పరీక్ష పెట్టానని సావ్జీ ఢోలకియా అన్నారు.