: ఆప్ ఎంపీ భగవత్ మాన్ దుస్సాహసం!... పార్లమెంటులో తీసిన వీడియోను సోషల్ మీడియా పెట్టిన వైనం!
మద్యం మత్తులోనే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్ మరో దుస్సాహసానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో పార్లమెంటులోకి వచ్చిన తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై చిందులు తొక్కారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాన్ ను తక్షణమే సభ నుంచి సస్పెండ్ చేయాలని అధికార పక్షం బీజేపీ వాదిస్తోంది. అయితే ఈ సమయంలోనే భగవత్ మరో దుస్సాహసానికి పాల్పడ్డారు. తానేమీ తప్పు చేయలేదని చెప్పడానికి ఆయన చేసిన ఈ దుస్సాహసం ఆయన మెడకే చుట్టుకుంది. తాను ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి పార్లమెంటు ఆవరణలోని లోక్ సభ లోపలికి వెళ్లే దాకా అన్ని పరిణామాలను వీడియో తీసిన ఆయన సదరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పార్లమెంటు ఆవరణలో వీడియో చిత్రీకరణ నిషిద్ధం. ఈ నేపథ్యంలో భగవత్ చేసిన ఈ దుస్సాహసంపై బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే భగతవ్ ను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఇప్పటికే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... భగవత్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయంపై అటు రాజ్యసభ కూడా అట్టుడికింది.