: చక్రం తిప్పిన షాపూర్జీ పల్లోంజీ!...9.8 శాతం ఎక్సెస్ కు గుంటూరు డ్రెయినేజీ పనులు దక్కించుకున్న వైనం!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం పనుల్లో సగం మేర కాంట్రాక్టులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ షాపూర్జీ పల్లోంజీ మరోమారు చక్రం తిప్పింది. గుంటూరు నగరపాలక సంస్థల్లో చేపట్టనున్న డ్రెయినేజీ పనులను ఆ సంస్థ చేజిక్కించుకుంది. ఇందులో చక్రం తిప్పడమేమిటనేగా మీ డౌటు? సాధారణంగా 5 శాతం కంటే తక్కువ ఎక్సెస్ బిడ్లకు అనుమతి ఉండగా... ఏకంగా 9.8 శాతం ఎక్సెస్ కు బిడ్ ను దాఖలు చేసిన ఆ సంస్థ సదరు పనులను ఎగరేసుకుపోయింది. వివరాల్లోకెళితే... గుంటూరు నగరపాలక సంస్థలో డ్రెయినేజీ వ్యవస్థను సరిదిద్దేందుకు రూ.777.04 కోట్లతో కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన షాపూర్జీ పల్లోంజి సంస్థ... ఏకంగా 9.8 శాతం ఎక్సెస్ తో రూ.853.35 కోట్లకు బిడ్ ను దాఖలు చేసింది. సాధారణంగా ప్రతిపాదిత రేటు కంటే 5 శాతంలోపు ఎక్సెస్ కు కోట్ చేస్తేనే సదరు బిడ్ ను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే షాపూర్జీ పల్లోంజి 9.8 శాతం ఎక్సెస్ కు బిడ్ ను దాఖలు చేసినా... సదరు పనులను ఆ సంస్థకే అప్పగిస్తూ ఏపీ సర్కారు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.