: ఇక కాంగ్రెస్ వంతు!... చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీడీపీలోకి జంప్!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటిదాకా విపక్షం వైసీపీనే లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్లింది. తాజాగా రాష్ట్ర విభజన దెబ్బతో అసెంబ్లీలో సింగిల్ సీటు కూడా దక్కించుకోలేక జీరో స్థాయికి పడిపోయిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పైనా దృష్టి సారించింది. ఫలితంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేందుకు రంగం సిద్ధమైపోయింది. జిల్లాలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేత, ప్రస్తుతం జిల్లాలోని మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డి చేతిలో సింగిల్ ఓటు తేడాతో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ నేత నరేశ్ కుమార్ రెడ్డి ఈ నెల 25న టీడీపీలోకి చేరుతున్నారు. చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరున్న నరేశ్... సింగిల్ ఓటు ఓటమిని జీర్ణించుకోలేక హైకోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ న్యాయపోరాటంలో భాగంగా ఆయన ఇటీవలే విజయం సాధించి ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టారు. గతంలో మదనపల్లె మునిసిపాలిటీ చైర్మన్ గానూ పనిచేసిన నరేశ్ ను టీడీపీలోకి లాగేందుకు స్థానిక పార్టీ నేతలు చేసిన యత్నాలు ఫలించాయి. ఈ క్రమంలో ఈ నెల 25న చంద్రబాబు సమక్షంలో నరేశ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News