: ఏపీ మంత్రి వర్గ విస్తరణ కసరత్తు మొదలు ... ఎమ్మెల్యేల్లో చిగురిస్తున్న ఆశలు!


ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచింది. అయినా, మంత్రి వర్గ విస్తరణ మాత్రం జరగలేదు. నిన్న విజయవాడలో జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో మంత్రి వర్గ విస్తరణ అంశాన్ని స్వయంగా సీఎం చంద్రబాబే ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే దీనిపై ప్రాథమిక కసరత్తు ఆయన ప్రారంభించినట్లు తెలుస్తోంది. జూన్ 8 2014న సీఎం చంద్రబాబు తో పాటు మరో 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అదే మంత్రి వర్గం కొనసాగుతోంది. అయితే, నిబంధనల ప్రకారం మంత్రి వర్గంలో 26 మందికి అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం మంత్రి వర్గంలో సీఎంతో కలిపి 20 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. పార్టీలోని సమర్థులు, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొంతమందిని తప్పించవచ్చని తెలుస్తోంది. కుల, మత, ప్రాంత సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉండవచ్చని సమాచారం. మంత్రివర్గంలోకి టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కళా వెంకట్రావును తీసుకోవచ్చని.. ఒకవేళ ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకుంటే మంత్రి మృణాళిని తన పదవిని కోల్పోవచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి గౌతు శ్యాంసుందర్ శివాజీ, విజయనగరం జిల్లా నుంచి పతివాడ నారాయణ స్వామి, ఇటీవల టీడీపీలో చేరిన సుజయ కృష్ణ రంగారావు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్టణం నుంచి బండారు సత్యనారాయణ మూర్తి, తూర్పుగోదావరి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోట త్రిమూర్తులు, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జ్యోతుల నెహ్రూ మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కేబినెట్ లో బెర్త్ కోసం గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. మంత్రుల పని తీరు దృష్ట్యా గుంటూరు జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నవారిని మారుస్తారనే ప్రచారం పార్టీ వర్గాలో ఉంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆశావహుల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి గాలి ముద్దు కృష్ణమ నాయుడు, అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సీనియర్ నాయకులు, ధాటిగా మాట్లాడ గలిగే వీరు అసెంబ్లీలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News