: భారత్ కు వచ్చే ప్రసక్తే లేదన్న మాల్యా!... లండన్ వచ్చి విచారించుకోండని ధిక్కార స్వరం!
బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరోమారు ధిక్కార స్వరం వినిపించారు. తనపై నమోదైన కేసుల విచారణ కోసం భారత్ కు వచ్చే ప్రసక్తి లేదని ఆయన మరోమారు సంచలన ప్రకటన చేశారు. అవసరమనుకుంటే దర్యాప్తు అధికారులు లండన్ వస్తే సహకరిస్తానని కూడా ఆయన చేసిన ప్రకటన పెను కలకలం రేపుతోంది. ‘ఆటో స్పోర్ట్’ అనే క్రీడా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత దర్యాప్తు సంస్థలు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని కూడా ఆయన ఓ వింత ఆరోపణ చేశారు. తన పాస్ పోర్టు రద్దు, తనపై అరెస్ట్ వారెంట్ల జారీ ఇందుకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు. భారత్ లోని దర్యాప్తు సంస్థలు రాజకీయ నేతల చేతుల్లో పావులుగా మారాయని కూడా మాల్యా ఆరోపించారు. దర్యాప్తునకు సంబంధించి తన ఏవియేషన్ సంస్థ కింగ్ ఫిషర్ కు చెందిన ఉన్నతాధికారులు, అనేక పత్రాలు దర్యాప్తు అధికారులకు అందుబాటులోనే ఉన్నాయని చెప్పిన మాల్యా... తనను భారత్ రప్పించి విచారించాల్సిన అవసరమేముందని కూడా ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్, ఈ-మెయిల్ ద్వారా దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు కూడా మాల్యా ప్రకటించారు. 1985లోనూ భారత దర్యాప్తు సంస్థలు తనను ప్రస్తుత తరహాలోనే వేధించాయని సంచలన ఆరోపణ చేసిన మాల్యా... రెండేళ్ల తర్వాత సదరు వేధింపుల నుంచి తాను బయటపడ్డానని చెప్పుకొచ్చారు.