: కీలక మలుపు తిరిగిన రూ.570 కోట్ల కేసు!... ఎన్నికల సమయంలో తమిళనాట పట్టుబడ్డ కంటెయినర్లకు ఏపీ బైకుల నెంబర్లు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ రూ.570 కోట్ల కేసు కీలక మలుపు తిరిగింది. సరిగ్గా ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడ్డ ఈ కేసు దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మద్రాస్ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ ఓ కీలక ఆధారాన్ని కనుక్కుంది. కోయంబత్తూరులోని స్టేట్ బ్యాంకు ఆప్ ఇండియా శాఖ నుంచి విశాఖలోని అదే బ్యాంకు శాఖకు ఈ నగదును తరలిస్తున్నట్లు ఆ సందర్భంగా వార్తలు వినిపించాయి. అయితే మూడు కంటెయినర్లలో తరలిస్తున్న ఈ నగదుకు భద్రతగా ఏ ఒక్క సాయుధ పోలీసు లేని వైనంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తున్నట్లుగా తాజాగా ఓ ఆధారాన్ని సీబీఐ సేకరించింది. నగదును తరలిస్తూ పట్టబుడ్డ మూడు కంటెయినర్లకు వాటి అసలు నెంబర్లు కాకుండా ఏపీకి చెందిన మూడు బైకుల నెంబర్ ప్లేట్లను తగిలించారట. కంటెయినర్లపై ఉన్న నెంబర్లు ఏపీ 13ఎక్స్5204, ఏపీ 13ఎక్స్8650, ఏపీ 5203 13ఎక్స్... ఏపీకి చెందిన మూడు బైకులవిగా సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.