: తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోలీస్ స్టేషన్: ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుదీర్ఘ సముద్ర తీరానికి రక్షణ కల్పించడంలో భాగంగా 21 మెరైన్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో మెరైన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో తొలి దశలో 6 మెరైన్ పోలీసు స్టేషన్లు, రెండోదశలో 9 మెరైన్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏపీ తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 21 మెరైన్ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని, అలాగే తీర ప్రాంతంలో గస్తీ తిరిగేందుకు వీలుగా 130 మెకనైజ్డ్ బోట్లను మెరైన్ పోలీసులకు ఇస్తామని ఆయన చెప్పారు. పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.