: దళితుల అంశంపై కాంగ్రెస్ ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోంది: రాహుల్ ‘నిద్ర’పై కేంద్రమంత్రి మహేశ్ శర్మ
గుజరాత్‌లో ఇటీవల జరిగిన దళితులపై దాడి ఘటనపై లోక్‌సభలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంటే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కునుకుతీసిన అంశంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి మహేశ్ శర్మ విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ నిద్రతో దళితుల అంశంపై కాంగ్రెస్ ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడుతోందని ఆయన అన్నారు. రాజకీయ ఎత్తులు వేయడం, స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆ పార్టీ పని అని మహేశ్ శర్మ అన్నారు. దళితుల పట్ల ఆ పార్టీకి ప్రేమలేదని ఆయన పేర్కొన్నారు. దళితులకు సేవచేసుకునే అవకాశం 60 ఏళ్ల పాటు కాంగ్రెస్‌కి లభించినా, ఆ పార్టీ అభివృద్ధి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. లోక్‌సభలో ఇంతటి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ నిద్ర పోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.