: తన మృతదేహానికి ప్రియుడితో తాళి కట్టించాలని చెప్పి కన్నుమూసిన జ్యోతి!
తనను ఓ యువకుడు ప్రేమించి మోసం చేసినందునే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, తాను మరణిస్తే, అతనితో తాళి కట్టించాలని మరణవాంగ్మూలం ఇచ్చిన జ్యోతి అనే యువతి కన్నుమూసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జ్యోతి, మురళీకృష్ణలు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించక పోవడంతో జ్యోతికి మురళి దూరమయ్యాడు. అతన్ని దూరం చేసుకోవడం ఇష్టంలేని జ్యోతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య ఉన్న ఆమె వద్ద మెజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం తీసుకున్నారు. తన చావుకు ప్రియుడు మురళీకృష్ణ, అతని కుటుంబ సభ్యులే కారణమని చెప్పిన జ్యోతి, తాను మరణిస్తే, మృతదేహానికి అతనితో తాళి కట్టించాలని చివరి కోరిక కోరి కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు.