: హైదరాబాద్ పాఠశాలల్లో వన్ టైమ్ ఫీజ్ పేరిట దోపిడీ!
హైదరాబాద్ లోని పలు ప్రైవేటు పాఠశాలలు వన్ టైమ్ ఫీజ్ (ఓటీఎఫ్) పేరిట దోపిడీకి పాల్పడుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఓటీఎఫ్ కింద ఒక్కో విద్యార్థి నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు లేకపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు డిమాండ్ చేశారు. ఓటీఎఫ్ కింద వసూలు చేసిన డబ్బులతో ఆయా పాఠశాలల యాజమాన్యం కొత్త బిల్డింగ్ లు కట్టిస్తున్న సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓటీఎఫ్ ను సవాల్ చేస్తూ హైదరాబాద్ స్కూల్స్ పేరేంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) హైకోర్టులో ఇటీవల ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలు చేసింది. ఈ పిల్ పై నిన్న హైదరాబాద్ లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించాల్సిన అవసరముందని యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ ఏవీ శేషసాయి సూచించడం తెలిసిందే. విద్యార్థుల నుంచి ఇంత పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని, ఈ పద్ధతిలో మార్పు రావాల్సిన అవసరముందని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ప్రైవేట్ పాఠశాలలు ఇంత పెద్దమొత్తాలను వసూలు చేస్తుండటం దారుణమని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ తో జస్టిస్ భోస్లే ప్రస్తావించారు. దీనిపై సంజీవ్ కుమార్ కోర్టుకు సమాధానం చెబుతూ, హైదరాబాద్ లో 160 పాఠశాలలు ఓటీఎఫ్ కింద రూ.50,000 నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాయనే విషయం తమ సర్వే ద్వారా తెలిసిందని చెప్పడంతో భోస్లే ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా చెల్లించగలుగుతారని ఆయన ప్రశ్నించడం జరిగింది. కాగా, పేరెంట్స్ సంఘం తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి కూడా తమ వాదనలను కోర్టుకు విన్నవించారు. ఓటీఎఫ్ కింద వసూలు చేసిన లక్షల రూపాయలతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కొత్త బిల్డింగ్ లు కట్టించుకుంటున్నాయని, ఉద్యోగస్తులైన తల్లిదండ్రుల సంపాదనలో 40 శాతం వరకు స్కూల్ ఫీజుల కిందకే పోతోందని, కొన్ని పాఠశాలలైతే ఓటీఎఫ్ కింద రూ.7 నుంచి రూ.8 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని, మంచి పేరున్న ఇంజనీరింగ్ కళాశాలలు వసూలు చేస్తున్న దాని కంటే పాఠశాలల్లో ఓటీఎఫ్ కింద చెల్లిస్తున్న డబ్బులే చాలా ఎక్కువని ఆయన ప్రస్తావించారు. హైకోర్టు డివిజన్ సూచనల మేరకైనా ప్రైవేటు పాఠశాలల తీరులో మార్పు వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.