: నాకు ఇంకా పూర్తి స్థాయి ఫిట్ నెస్ లేదు: బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
తాను ఇంకా పూర్తి స్థాయి ఫిట్ నెస్ పొందలేదని ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. తన కెరీర్ లో మూడోసారి ఒలింపిక్ క్రీడలలో పాల్గొననున్న సైనా ఒక ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వందశాతం ఫిట్ నెస్ పొందేందుకు ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పింది. గతంలో తగిలిన గాయాల నుంచి కోలుకుంటున్నానని, రాబోయే రోజుల్లో తన ప్రాక్టీస్ ను మరింత మెరుగుపరచుకోవాలని పేర్కొంది. రియో ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి నాలుగు వారాల సమయం ఉందని, అప్పటికల్లా అన్నీ మెరుగుపడతాయని, శారీరకంగా దృఢత్వాన్ని మరింతగా పెంచుకుంటానని చెప్పింది. కాగా, సైనా నెహ్వాల్ రోజుకు ఐదారు గంటల పాటు ప్రాక్టీసు చేస్తోంది. ఆటలో తన వీక్ పాయింట్లను అధిగమించడంపై ఆమె దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారులతో తలపడేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఆమె ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే, చైనా క్రీడాకారుల బలమైన షాట్లను ఎదుర్కోవాలంటే పర్ఫెక్ట్ ఫిట్ నెస్ ఉండాలని సైనా నెహ్వాల్ చెప్పింది.