: సుప్రీం తీర్పుపై ఏం చేద్దాం?.. ఈ నెల 25న బీసీసీఐ సభ్యుల సమావేశం
బీసీసీఐ ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ సుప్రీంకోర్టు నిన్న పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై తాము వ్యవహరించాల్సిన అంశంపై చర్చించడానికి బీసీసీఐ ఈనెల 25న సమావేశం నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. కోర్టు వెలువరించిన 143 పేజీల తీర్పు నుంచి ఏవైనా అంశాలపై మినహాయింపు లభిస్తాయా? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. సుప్రీం ఇచ్చిన తీర్పుని పాటించి తీరాల్సిందేనని కొందరు, లోధా కమిటీ సిఫార్సులను అమల్లో పెట్టకపోతే ఏమవుతుందని మరికొంతమంది సభ్యులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐలో ఏకఛత్రాధిపత్య తీరు పాతుకుపోవడంతో, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీరికి డైజెస్ట్ కావడం లేదు. బీసీసీఐ సభ్యుడిగా నియమితం కావాలంటే మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇకపై అనర్హులని సుప్రీం పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే బీసీసీఐ సభ్యుల వయసు 70 ఏళ్లకు మించరాదని నిబంధన పెట్టింది. లోధా కమిటీ సూచించిన సంస్కరణలను బీసీసీఐ అమల్లోకి తెచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం బోర్డుకి ఆరు నెలల వ్యవధి ఇచ్చింది.