: సర్జరీ చేయించుకున్నా... రెండు నెలల పాటు సరిగ్గా నడవలేను: హీరోయిన్ దీక్షా పంత్
‘గోపాల గోపాల’, ‘శంకరాభరణం’ చిత్రాల హీరోయిన్ దీక్షా పంత్ మోకాలి సర్జరీ కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఐదేళ్ల క్రితం టూవీలర్ పై వెళుతున్న నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో నా ఎడమ కాలికి గాయమైంది. క్రమం తప్పకుండా ఫిజియో థెరపీ చేయించుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాడు సూచించారు. కానీ, అప్పుడున్న మోడలింగ్ ప్రాజెక్టులు, ఆ తర్వాత వచ్చిన సినిమా అవకాశాలతో బిజీ అయిపోయాను. అయితే, గత నాలుగు నెలలుగా నా మోకాలి బాధ తీవ్రంగా బాధించడంతో నడవలేని పరిస్థితి వచ్చింది. దీంతో, వైద్యులను సంప్రదిస్తే మోకాలికి సర్జరీ చేయాలని చెప్పారు. ‘బంతిపూల జానకి’, ‘చల్ చల్ గుర్రం’, తదితర సినిమాల షూటింగ్ లు ముగించుకున్న అనంతరం గత నెలలో నా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. రెండు నెలల పాటు సరిగ్గా నడవడం కూడా కష్టమే. డ్రైవింగ్, డ్యాన్సింగ్ వంటి వాటి జోలికి వెళ్లే ప్రసక్తే లేదు’ అని దీక్షా పంత్ చెప్పింది.