: ప్రధానితో శభాష్ అనిపించుకున్నాడు... అయినా లోను కోసం అష్టకష్టాలు పడుతున్నాడు!
చెక్కతో అద్భుతంగా వస్తువులు తయారు చేయగలిగే ప్రతిభ అతని సొంతం. అంతేకాదు, వాటిలో చక్కగా అక్షరాలు చెక్కగలిగే నేర్పు ఆయనకుంది. ఆయనే కాన్పూర్కు చెందిన సందీప్ సోని అనే కార్పెంటర్. మూడున్నరేళ్లు కష్టపడి ఐదు నెలల క్రితం 32 చెక్కలపై భగవత్ గీతకు చెందిన 18 భాగాలు, 706 శ్లోకాలు అక్షరాలుగా చెక్కడాన్ని పూర్తి చేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా అతడి ప్రతిభను మోదీ స్వయంగా ప్రజలకి తెలియపరిచారు. ఆయన పనితీరు చూసిన మోదీ, చిన్న కార్పెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి అతనికి తోడుగా నిలుస్తానని చెప్పారు. సందీప్ సోనికి లోన్ ఇవ్వాలని మోదీ సూచించారు. కానీ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు వెళ్లినా ఏ మాత్రం లాభం లేకపోయింది. ప్రధాని మంత్రి ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ (పీఎంఈజీపీ) పథకం కింద లోన్ కు దరఖాస్తు చేసుకొని బ్యాంకు అధికారులను ఎంతగా అడిగినా తాను పెట్టాలనుకుంటోన్న ఫ్యాక్టరీ కోసం లోను లభించడం లేదని సందీప్ సోని వాపోతున్నాడు. స్వయాన ప్రధాని మోదీ తనకు లోనివ్వమని చెప్పినా అది దక్కకపోవడంపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. ‘ప్రధాని చెబితేనే నాకు లోను రావట్లేదు.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?’ అని ఆయన ప్రశ్నిస్తున్నాడు.