: భారత్‌కు చైనా సుద్దులు.. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు
భారత్‌కు చైనా సుద్దులు చెబుతోంది. కశ్మీర్ ఘర్షణలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని, శాంతియుత వాతావరణాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే చర్చల ద్వారా భారత్-పాక్‌లు సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొంది. ‘‘కశ్మీర్లో చెలరేగుతున్న అల్లర్లపై మేం ఆందోళన చెందుతున్నాం. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి తిరిగి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలి. పార్టీలన్నీ కలిసి చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తాయని ఆశిస్తున్నాం’’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కశ్మీర్లో జరిగిన అల్లర్లలో 40 మంది మృతి చెందారని పేర్కొన్న చైనా భారత్ నియంత్రణలో ఉన్న కశ్మీర్లో తగిన చర్యలు తీసుకుని ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచేందుకు కృషి చేయాలని పేర్కొంది. కశ్మీర్ విషయంలో చైనా స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు కంగ్ పునరుద్ఘాటించారు.