: తలైవా అభిమానులూ! ఒక్కసారి పేదలను గుర్తుకు తెచ్చుకోండి: తమిళనాడు పాల వ్యాపారులు


'కబాలి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. టికెట్లు ఆల్రెడీ అమ్ముడయ్యాయి. 'తలైవా' అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ఇంతలో తమిళనాడు పాల వ్యాపారుల సంఘం రజనీకాంత్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. 1992లో తమిళనాట విజయం సాధించిన 'అన్నామలై' (తెలుగులో కొండపల్లి రాజా) సినిమాలో రజనీకాంత్ పాలవాడిగా కనిపించిన నాటి నుంచి ఆయన సినిమా విడుదలైందంటే చాలు, తమ అభిమాన హీరో కటౌట్లకు క్షీరాభిషేకం పేరిట వందల లీటర్ల పాలు నేలపాలు చేస్తున్నారు. ఈ సంబరాలపై పలువురు మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాలను పేదలకు దానం చేయడం ద్వారా రజనీకాంత్ ప్రతిష్ఠను పెంచవచ్చని వారు అభిమానులకు పలు సందర్భాల్లో సూచించారు. తాజాగా 'కబాలి' విడుదల సందర్భంగా సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే 50 వేల లీటర్ల పాలు ఆ విధంగా నేలపాలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న వారంతా అభిమానులు ఇలాంటి చెత్త సంప్రదాయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చాలా మంది పేదలు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారని, కావాలంటే వారిని ఆదుకోవాలని తమిళనాడు పాల వ్యాపారుల సంఘం 'కబాలి' అభిమానులను కోరింది.

  • Loading...

More Telugu News