: స్నేహితురాలితో మాట్లాడి బిల్డింగ్ పైనుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ
స్నేహితురాలితో ఫోన్ లో మాట్లాడి, ఆ మరుక్షణమే ఓ టెక్కీ తానుంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. నమ్మక్కల్ జిల్లాకు చెందిన ఎం.గంగాదేవి(22) కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ లో టెస్ట్ ఆపరేటర్ గా పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో ఉండే తన స్నేహితురాలితో ఫోన్ లో మాట్లాడింది. ఫోన్ పెట్టేసిన మరుక్షణమే తానుంటున్న అపార్ట్ మెంట్ లోని ఆరో అంతస్తు నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంగాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు మాట్లాడిన స్నేహితురాలిని ప్రశ్నిస్తున్నారు.