: ఉద్రిక్తతను మరింతగా పెంచుతున్న చైనా... వివాదాస్పద సముద్రంలో న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణం!
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో మొబైల్ న్యూక్లియర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్న చైనా ప్రయత్నాలు, ఉద్రిక్తతను మరింత పెంచుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్య ధోరణిని తగ్గించుకోవాలని, దక్షిణ చైనా సముద్రపు దీవులపై చైనా పెత్తనం చెల్లదని హేగ్ ఐరాస కోర్టు తీర్పిచ్చిన రోజుల తరువాత, చైనా అణు కేంద్రాల నిర్మాణం వార్తలు వెలువడటం గమనార్హం. సముద్రంలో తన హక్కులను కాపాడుకునేందుకే న్యూక్లియర్ ప్లాంట్ల నిర్మాణానికి పూనుకున్నట్టు చైనా అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ సైతం తన సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా స్పష్టం చేసింది. ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ పెద్దఎత్తున తయారు చేసి, దాన్ని సముద్రపు అవసరాలు, నిఘా నిమిత్తం వాడనున్నామని, ఇవి ఎక్కడికి కావాలంటే, అక్కడికి తీసుకువెళ్లేలా ఉంటాయని తెలుస్తోంది.