: ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిశువులు అప‌హ‌ర‌ణ‌కు గురికాకుండా కొత్త విధానం ... తల్లీబిడ్డలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్స్


విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుప‌త్రిలో ఇటీవల శిశువు అప‌హ‌ర‌ణ‌కు గుర‌యిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ ఎక్క‌డా జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్.. ప‌లువురు అధికారుల‌తో క‌లిసి దానికి త‌గ్గ ఏర్పాట్ల‌ను చేశారు. ఇక‌పై ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో త‌ల్లి, శిశువుకు ప్ర‌త్యేక ట్యాగులివ్వ‌నున్నారు. ఇత‌రులు శిశువుని తీసుకెళితే అలారం మోగేట‌ట్లు దీని ప‌నితీరు ఉంటుంది. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ)ట్యాగ్‌ అనే ఈ నూతన విధానాన్ని మంత్రులు పుల్లారావు, రవీంద్రలతో కలిసి కామినేని ఈరోజు ప్రారంభించారు. ఏపీలోని బోధన, జిల్లా, సామాజిక ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమ‌లు ప‌రుస్తున్న‌ట్లు కామినేని ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపారు. గర్భిణి ఆసుప‌త్రికి రాగానే ఈ విధానం గురించి ఆమెకు తెలిపి, ట్యాగింగు చేసి ఒక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తామని ఆయ‌న తెలిపారు. కాన్పు తర్వాత ఆమెకు జ‌న్మించిన శిశువుకి కూడా మరో సంఖ్య ఇస్తామని, త‌ల్లీబిడ్డ‌ల‌కు ట్యాగింగు చేసిన తర్వాత వారి కదలికలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయ‌ని కామినేని పేర్కొన్నారు. త‌ల్లిలేని స‌మ‌యంలో ఆసుప‌త్రినుంచి పసిబిడ్డను బయటకు ఎవరైనా తీసుకువెళితే శబ్దం చేస్తూ ఓ సంకేతం వ‌స్తుంద‌ని కామినేని చెప్పారు. సంకేతం రావ‌డంతో భద్రతా సిబ్బందికి ఈ స‌మాచారం అందించే అవ‌కాశం ఉంటుంద‌ని, తద్వారా శిశువు అప‌హ‌ర‌ణ కేసుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News