: ముఖ్యమంత్రి నబం టు కీ రాజీనామా.. అరుణాచల్ ప్రదేశ్‌లో బలపరీక్ష వాయిదా
అరుణాచల్ ప్రదేశ్‌లో గతేడాది డిసెంబర్‌కు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన అనంతరం ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా క్షణ క్షణానికీ మారిపోతున్నాయి. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహించాల్సిందిగా ఇటీవలే ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించారు. అయితే, ఈరోజు జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడింది. బల నిరూపణలో తమదే విజయమని మొదట ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి నబం టు కీ ఒక్కసారిగా తన పదవికి రాజీనామా చేశారు. కాగా, కొత్త శాసనసభా నాయకునిగా ఎన్నికైన పెమా ఖండు ఈ రోజు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనాల్సి ఉంది. అయితే, బలపరీక్షకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనట్లు ప్రకటించిన కారణంగా ఈరోజు జరగాల్సిన బలపరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. మొత్తం 58 సీట్లు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ 45 మంది సభ్యులతో బలంగా ఉంది, అంతేగాక మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది.