: కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోవాలి: దత్తాత్రేయ
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులతో పాటు కృష్ణా పుష్కరాలకు కేంద్రం నుంచి నిధులు వచ్చేలా తాను ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు, మిర్చి, చేనేత పార్కులు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద కేంద్రం నుంచి ఇప్పటికే నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక, తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరేలా 14వ ఆర్థిక సంఘం 580 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు దత్తాత్రేయ చెప్పారు. అయితే రాష్ట్రాలకు అందుతోన్న నిధులను సరిగా ఉపయోగించుకొని ఖర్చు చేసే బాధ్యత రాష్ట్ర సర్కారుదేనని ఆయన పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తన శాఖ తరఫున మూడు బిల్లులు ప్రవేశపెట్టే యోచన ఉందని తెలిపారు. జీ20 దేశాలు కూడా మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అభినందించాయని తన చైనా పర్యటన వివరాలను ఆయన పేర్కొన్నారు.