: తెలంగాణ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం
తెలంగాణ ప్రభుత్వం గతంలో గుప్పించిన హామీలు, దాని తీరుపట్ల బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన హామీలు ఏవీ అమలు చేయలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నేతలు 100 రోజుల ప్రణాళిక వేస్తామని చెప్పారని, ఇప్పుడు ఆ ప్రణాళిక గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. వారు చేసిన హామీలన్నీ మాటలకే పరిమితమా..? అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు ఏ మాత్రం తీరలేదని ఆయన అన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ టవర్లు నిర్మిస్తామని, కొబ్బరి నీళ్ళతో సాగర్ ని నింపుతామని టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకున్నారని ఇప్పుడు వాటి గురించి పట్టించుకోరేం...? అని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం మరచిపోయిందని, ఇక హామీలేం గుర్తుంటాయని ఆయన అన్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, జీహెచ్ఎంసీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన ఆరోపించారు.