: సైనిక తిరుగుబాటును తిప్పికొట్టిన టర్కీ ప్రజలు!... సైనికులను ఎక్కడికక్కడ బంధిస్తున్న వైనం!
టర్కీ ప్రజలు తమ దేశ సైన్యానికి షాకిచ్చారు. తామెన్నుకున్న ప్రభుత్వమే తమను పాలించాలని తీర్మానించారు. వెరసి ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నిస్తూ తిరుగుబాటు చేసిన సైనిక చర్యను తిప్పికొట్టారు. గంటల వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాల మధ్య సైన్యం తోకముడవక తప్పలేదు. టర్కీ రాజధాని అంకారాలో వైమానిక దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ సైన్యం నిన్న రాత్రి తిరుగుబాటు చేసింది. దేశం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. అయితే, సైనిక తిరుగుబాటుపై ఆగ్రహోదగ్రులైన జనం రోడ్డెక్కారు. కనిపించిన సైనికులను ఎక్కడికక్కడ పోలీసుల సాయంతో బంధించేశారు. ఇప్పటిదాకా ఒక్క అంకారాలోనే 336 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాగ్రహంతో బిక్కచచ్చిన సైనికులు ఎక్కడికక్కడ పోలీసులకు స్వయంగా లొంగిపోతున్నారు. వెరసి టర్కీలో సైనిక తిరుగుబాటుకు మరికాసేపట్లోనే చెక్ పడే అవకాశాలున్నాయి.