: అమెరికా ముస్లింలకు ‘షరియా టెస్ట్’: ఆ చట్టాలను నమ్మేవారు యూఎస్ నుంచి వెళ్లాల్సిందేనన్న ప్రముఖ నేత
షరియా చట్టాలను నమ్మే వారు అమెరికాలో ఉండాల్సిన పనిలేదని యూఎస్ హౌస్ మాజీ స్పీకర్ నెవ్ట్ గింగ్రిచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతీ ముస్లింకు ‘షరియా టెస్ట్’ నిర్వహించాలని ఆయన కోరారు. ఇస్లామిక్ చట్టాలను నమ్మేవారిని దేశం నుంచి పంపించి వేయాల్సిందేనని పేర్కొన్నారు. పాశ్చాత్య నాగరికతకు షరియా ఏమాత్రం సరిపడదని తెలిపారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం నాగరిక సమాజం యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. ముస్లిం నేపథ్యం ఉన్న ప్రతీ ఒక్కరినీ పరీక్షించాల్సిందే. వారు కనుక షరియా చట్టాలను నమ్మితే దేశం విడిచి వెళ్లాల్సిందే’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆధునిక ముస్లింలు ‘షరియా’ను పట్టించుకోవడం లేదన్న ఆయన ఈ విషయంలో సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.