: రష్యా అద్భుతంగా అభివృద్ధి సాధించింది, ఆ దేశంతో ఒప్పందాలు చేసుకొని ముందుకెళతాం: చంద్రబాబు
విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, తన రష్యా పర్యటన విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో రష్యాకి మంచి పేరుందని, ఏపీకి అలాంటి ఇమేజ్ తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. రష్యాకి, భారత్‌కి మంచి స్నేహబంధం ఉందని ఆయన చెప్పారు. ఈ సత్సంబంధాలు కేవలం ఢిల్లీ, మాస్కోకే పరిమితం కాదని ఆయన చెప్పారు. ఏపీ పర్యటనకు రష్యా ప్రధాని సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య సారూప్యత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశం విస్తీర్ణత రష్యాకన్నా ఎంతో తక్కువని, జనాభా సంఖ్య మన కన్నా రష్యాకి ఎంతో తక్కువని చంద్రబాబు అన్నారు. రష్యాకి ఉన్న వనరులు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఆ దేశం అవలంబించిన పాలసీలతో రష్యా మంచి అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకుల వల్ల ఆ దేశ ప్రగతి సాధ్యమయిందని చెప్పారు. రష్యా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గురించి, వాటిని ఎదుర్కొన్న తీరుని గురించి వివరించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను పుతిన్ గాడిలో పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆ దేశంతో కొన్ని ఒప్పందాలు చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.