: పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు సరళతరం
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ - ఉద్యోగుల భవిష్య నిధి) నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే నిబంధనలను కేంద్రం సరళీకరించింది. 2014 జనవరి 1కి ముందు పదవీ విరమణ చెందిన వారంతా, సార్వత్రిక ఖాతా నంబర్ (యూఏఎన్) వెల్లడించకుండానే విత్ డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబరులో యూఏఎన్ ను వెల్లడించిన తరువాత మాత్రమే ఈపీఎఫ్ ను తీసుకునేలా ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది మంది డబ్బు విత్ డ్రాకు ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేయగా, పరిస్థితిని సమీక్షించిన ఈపీఎఫ్ఓ అధికారులు, ఆర్థిక శాఖ నిబంధనలను కొంతమేరకు సరళీకరిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ నిర్ణయం రెండేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఖాతాల్లో డబ్బును ఉంచుకున్న వారందరికీ మేలును కలిగించనుంది.