: సోనియాకు పెద్ద ఊరట... అగస్టా స్కాంలో ఎఫ్ఐఆర్ నమోదుకు సుప్రీం తిరస్కరణ


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణం నుంచి పెద్ద ఊరట లభించింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ను దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతించాలని దాఖలైన పిటిషన్ ను, ఈ ఉదయం విచారించిన సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ స్కాములో విచారణ ఇప్పటికే పూర్తయిందని, రూ. 3,600 కోట్ల విలువైన స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని సీబీఐ స్వయంగా చూసుకుంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కల్పించుకోలేమని స్పష్టం చేసింది. అంతకుముందు ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఓ పిటిషన్ దాఖలు చేస్తూ, సోనియాగాంధీ సహా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అహ్మద్ పటేల్ లపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటలీ అధికారులు వీరి పేర్లను చార్జ్ షీట్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. దీనిపై విచారణ సాగగా, ప్రస్తుతానికి కల్పించుకోబోమని, సీబీఐ ఎటువంటి చర్యలూ తీసుకోకుంటే, పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

  • Loading...

More Telugu News