: నల్లధనం కట్టడికి 'సిట్' సిఫారసులివే...!
దేశంలో పెరుగుతున్న నల్లధనం కట్టడికి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన 'సిట్' పలు ప్రతిపాదనలు చేసింది. అందులో భాగంగా మూడు లక్షలకు మించిన నగదు లావాదేవీలు కుదరవని తేల్చిచెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో మూడు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీ జరపాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, అలా కాకుండా జరిగిన లావాదేవీలన్నీ అక్రమమైనవని పేర్కొని రద్దు చేయాలని సూచించింది. అలాగే 15 లక్షల రూపాయలకు మించిన నగదును వ్యక్తుల దగ్గర ఉంచుకోవడం నేరమని ప్రకటించాలని చెప్పింది. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు ఉంచుకోవాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇలాంటి మరిన్ని ప్రతిపాదనలను సిట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వీటిని కేంద్రం పరిశీలిస్తోంది. దేశంలో పెద్దమొత్తంలో ప్రభుత్వ లెక్కల్లోకి రాని సంపద పోగై ఉందని, ఇదంతా నగదు రూపంలో నిల్వచేయబడి ఉందని, దీనిని వెలికి తీయాలంటే కఠిన చట్టం, నిబంధనలు అవసరమని సిట్ అభిప్రాయపడింది. తాజా ప్రతిపాదనలు చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా ఉన్నాయి.