: విదేశీయుల మద్దతుతో లాభాల పట్టాలెక్కిన స్టాక్ మార్కెట్


భారత స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల పట్టాలెక్కింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 10 నుంచి 50 పాయింట్ల నష్టం మధ్య మధ్యాహ్నం వరకూ సాగిన బెంచ్ మార్క్ సెన్సెక్స్, ఆపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో లాభాల్లోకి దూసుకెళ్లింది. దేశవాళీ ఫండ్ సంస్థలు సైతం ఎఫ్ఐఐల దారిలోనే నడిచి స్మాల్ క్యాప్ సెక్టార్ కంపెనీల ఈక్విటీలను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో సమయం గడిచే కొద్దీ మార్కెట్ లాభాలు పెరుగుతూ వెళ్లాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 126.93 పాయింట్లు పెరిగి 0.46 శాతం లాభంతో 27,942.11 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 45.50 పాయింట్లు పెరిగి 0.53 శాతం లాభంతో 8,565/00 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.54 శాతం, స్మాల్ కాప్ 0.73 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 39 కంపెనీలు లాభపడ్డాయి. గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, జడ్ఈఈఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,872 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,587 కంపెనీలు లాభాలను, 1,100 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, రూ. 1,06,30,629 కోట్లకు పెరిగింది.

  • Loading...

More Telugu News