: సమన్లు ఇచ్చామంటున్న ఢిల్లీ ఏసీబీ!... అందలేదంటున్న షీలా దీక్షిత్!
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పాలనలో వెలుగు చూసిన వాటర్ కుంభకోణంలో నాడు సీఎంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ కు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది. ఈ విషయంపై ఇప్పటికే ఏసీబీ చీఫ్ ఎంకే మీనా స్పష్టమైన ప్రకటన చేశారు. ఆగస్టు 26న విచారణకు హాజరుకావాలని షీలా దీక్షిత్ కు నోటీసులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై షీలా దీక్షిత్ విరుద్ధ ప్రకటన చేశారు. వాటర్ కుంభకోణంలో విచారణకు సంబంధించి ఆగస్టులో నోటీసులు అందుతాయని చెబుతూ ఇటీవల ఏసీబీ ఓ లేఖ జారీ చేసిందని ఆమె చెప్పారు. అయితే విచారణకు ఎప్పుడు హాజరుకావాలన్న విషయాన్ని తెలుపుతూ ఏసీబీ జారీ చేసిన లేఖ తనకు ఇప్పటిదాకా చేరలేదని ఆమె చెప్పారు. సదరు లేఖ అందితే, అందులో స్పష్టమైన తేదీ ఉంటే ఏసీబీ విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఆమె ప్రకటించారు.