: టీడీపీ కంచుకోటలో జగన్ కు వెల్లువెత్తిన అభిమానం!... జంగారెడ్డిగూడెం సభకు వేలాదిగా తరలివచ్చిన జనం!
పశ్చిమగోదావరి జిల్లా... టీడీపీకి కంచుకోట. ఎందుకంటే, గడచిన ఎన్నికల్లో ఆ జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలు కూడా ఆ పార్టీ ఖాతాలోనే చేరాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ జిల్లా నుంచి భారీ ప్రజాదరణ కనిపించినా సింగిల్ సీటు కూడా దక్కలేదు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పదే పదే ప్రస్తావించిన విషయమూ మనకు తెలిసిందే. మొత్తం సీట్లన్నీ దక్కిన జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా తనకు ప్రత్యేకమేనని కూడా చంద్రబాబు చెప్పారు. అలాంటి జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని తేలిపోయింది. నిన్న ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరిన జగన్... కొద్దిసేపటి క్రితం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి వచ్చారు. పట్టణంలోని సెంటర్ లో ఏర్పాటు చేసిన జగన్ బహిరంగ సభకు జనం తండోపతండాలుగా హాజరయ్యారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో ఎన్నికలు ముగిసి రెండేళ్లవుతున్నా... ఇంకా తనకు ప్రజాదరణ తగ్గలేదన్న భావనతో అశేష జనాన్ని చూసిన జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.