: నాతో పరిగెత్తేందుకు వేటకుక్క కావాలి... వైస్ ప్రెసిడెంట్ పై డొనాల్డ్ ట్రంప్ దురుసు వ్యాఖ్య!
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడి పేరును వెల్లడించాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ, తన నోటి దురుసును మరోసారి బయటపెట్టారు. తనతో కలసి పరిగెత్తేందుకు ఓ వేటకుక్క కావాలని, దానికోసం వెతుకుతున్నానని అన్నారు. 'వాల్ స్ట్రీట్ జర్నల్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా ఇండియానా గవర్నర్ మైక్ మెన్స్, మాజీ స్పీటర్ న్యూట్ గిన్ గ్రిచ్, న్యూజర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్తే, అలబామా సెనెటర్ జెఫ్ సెషన్స్ తదితరులను ట్రంప్ పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్న వేళ, ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై అన్ని వైపుల నుంచి దాడులు జరుపుతున్నారని, వాటిని ఎదుర్కోవాలంటే, వేటకుక్క ఉండాల్సిందేనని అన్నారు. క్రిస్ లేదా న్యూట్ లు సరిపోతారని భావిస్తున్నట్టు తెలిపారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ పదవి ఈ ఇద్దరిలో ఒకరికి లభిస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.