: స్వాతి హత్యకేసు నిందితుడి పరేడ్.. రామ్‌కుమార్‌ను గుర్తించిన బాధితురాలి తండ్రి
చెన్నైలో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ టెకీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్‌కుమార్‌ను బాధితురాలి తండ్రి గుర్తించారు. మంగళవారం పుజల్ జైలులో పోలీసులు ఐడెంటిఫికెషన్ పరేడ్ నిర్వహించారు. మొదట స్వాతి తండ్రి శంతన గోపాలకృష్ణన్‌ను పిలిపించిన అధికారులు వరుసగా నిలబెట్టిన పదిమంది వ్యక్తుల్లో నిందితుడిని గర్తుపట్టమని కోరారు. ఎడమ నుంచి నాలుగో వ్యక్తే తన కుమార్తెను హత్య చేశాడని చెబుతూ రామ్‌కుమార్‌ను గోపాల్‌కృష్ణన్ గుర్తుపట్టారు. అతడిని పంపించి వేసి నిందితుడి వరుస క్రమం మార్చి రెండో సాక్షి అయిన నుంగంబాకం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై పుస్తకాలు విక్రయించే వ్యక్తిని పిలిపించారు. వరుసలో నిల్చున్న తొమ్మిదో వ్యక్తే స్వాతిని చంపాడని అతను చెప్పాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీశారు. పరేడ్‌లో నిందితుడితోపాటు అదే వయసున్న మరో తొమ్మిది మందిని పోలీసులు నిలబెట్టారు. రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో గొంతు కోసుకోవడంతో ఆస్పత్రిలో అతనికి చికిత్స చేసి మెడకు బ్యాండేజ్ వేశారు. దీంతో పరేడ్‌లో నిల్చున్న మిగతా వారి మెడలకు కూడా పోలీసులు బ్యాండేజ్ వేశారు. తన కుమార్తె స్వాతి ఒకసారి రామ్‌కుమార్‌ను తనకు చూపించిందని దర్యాప్తు సమయంలో చెప్పడంతో గోపాల్‌కృష్ణన్‌ను సాక్షిగా పరిగణించినట్టు పోలీసులు పేర్కొన్నారు. చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శంకర్ సమక్షంలో పోలీసులు నిందితుడి పరేడ్ నిర్వహించారు. సాక్షులు రామ్‌కుమార్‌ను గుర్తుపట్టడంతో రికార్డు చేసిన వీడియోను ఎగ్మోర్‌లోని 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు అందించనున్నట్టు శంకర్ తెలిపారు.