: ఆరంభంలోనే అదరగొట్టిన క్వెస్ కార్ప్... నమ్మిన ఇన్వెస్టర్లకు తొలిరోజే 57 శాతం రాబడి
ఇటీవల ఐపీఓకు వచ్చిన మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించిన ఉద్యోగ నిమాయక సేవల సంస్థ క్వెస్ కార్ప్, లిస్టింగ్ తొలిరోజే అదరగొట్టింది. ఇష్యూ ప్రైస్ రూ. 317 కాగా, మంగళవారం నాడు లిస్టయిన సంస్థ సెషన్ ఆరంభంలోనే ఏకంగా రూ. 499 వద్ద ట్రేడ్ అయింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 57.41 శాతం అధికం. రూ. 501 ఇన్ ట్రాడే గరిష్ఠాన్ని తాకిన క్వెస్ కార్ప్ ఈక్విటీ ధర ప్రస్తుతం 56 శాతం లాభాన్ని అందిస్తూ, రూ. 495 వద్ద కొనసాగుతోంది. కాగా, గత వారంలో లిస్ట్ అయిన మహానగర్ గ్యాస్ సైతం తొలి రోజున 28 శాతం లాభాలను నమ్మిన ఇన్వెస్టర్లకు అందించిన సంగతి తెలిసిందే. మహానగర్ గ్యాస్ ఇష్యూ ధర రూ. 421 కాగా, తొలిరోజున ఈక్విటీ విలువ రూ. 540 వరకూ వెళ్లింది.