: విజయనిర్మలతో కలిసి మొక్కలు నాటిన సూపర్‌స్టార్ కృష్ణ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సినీనటుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి తెలుగు సినీనటులు పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ.. ప్రజలు హరితహారం కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో ఈరోజు ఉదయం తెలుగు సినీనటుడు, సూపర్‌స్టార్ కృష్ణ ఆయన సతీమణి విజయనిర్మలతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కృష్ణ దంపతులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విజయనిర్మల కుమారుడు, నటుడు నరేశ్ కూడా పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కృష్ణ సూచించారు.