: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. కోర్టు వద్ద కాల్పులు.. ఇద్దరు అధికారుల మృతి
అమెరికాలోని డలాస్ నగరంలో ఇటీవల ఆందోళనకారులు జరిపిన కాల్పుల ఘటన మరవకముందే ఈరోజు ఆ దేశంలో మరోసారి కాల్పులు జరిగాయి. ఓ ఖైదీ చేసిన కాల్పులతో మిచిగాన్ స్టేట్ సెయింట్ జోసెఫ్ పట్టణంలోని బెరియన్ కౌంటీలో కోర్టు సిబ్బంది, స్థానికులు ఉలిక్కిపడ్డారు. కోర్టులో రెచ్చిపోయిన ఖైదీ కాల్పులు జరిపి ఇద్దరు అధికారుల ప్రాణాలను బలిగొన్నాడు. అక్కడి సిబ్బంది వేగంగా స్పందించి కాల్పులు జరుపుతోన్న ఖైదీపై ఎదురు కాల్పులు జరిపి, అతడిని హతమార్చారు. ఖైదీని విచారణ నిమిత్తం కోర్టుకి తీసుకొచ్చామని, అయితే ఖైదీ ఒక్కసారిగా దాడికి దిగాలనే ఉద్దేశంతో ఓ అధికారి నుంచి తుపాకీ లాక్కున్నాడని అక్కడి అధికారులు తెలిపారు. అధికారి నుంచి లాక్కున్న తుపాకీతో కోర్టుహౌస్‌కు సెక్యురిటీగా ఉండే ఇద్దరు అధికారులను కాల్చిచంపేశాడని పేర్కొన్నారు. ఖైదీకి సంబంధించిన ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు. నల్లజాతీయుల ఆందోళనలో ఇటీవలే ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపిన నేపథ్యంలో తాజాగా కోర్టు వద్ద జరిగిన ఈ ఘటన అలజడి రేపింది.