: దక్షిణ అమెరికా చిరుత ‘రిక్కీ’ కన్ను తొలగింపు
గత ఆరేళ్లుగా కంటి చూపు మందగించిన కారణంగా బాధపడుతున్న చెన్నై జూలో ఉన్న దక్షిణ అమెరికా చిరుత రిక్కీ కంటిని శస్త్ర చికిత్స ద్వారా వెటర్నరీ వైద్యులు తొలగించారు. ఈ మేరకు జూ డైరెక్టర్, అడిషినల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కేఎస్ఎస్వీపీ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. మద్రాసు వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులైన వైద్యులు, యూఎస్ ఏకు చెందిన స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూషన్ కు చెందిన నిపుణులు కలిసి రిక్కీకి శస్త్ర చికిత్స నిర్వహించి పూర్తిగా చూపు మందగించిన కంటిని నిన్న తొలగించారని, ప్రస్తుతం రిక్కీకి మందులు వాడుతున్నామన్నారు. సాధారణంగా అయితే దక్షిణ అమెరికా చిరుత జీవిత కాలం పదిహేనేళ్లని, సంరక్షణ కల్పిస్తే ఇరవై సంవత్సరాల వరకు జీవిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.