: పాత స్మార్ట్ ఫోన్లలో 'ప్యానిక్' బటన్ అసాధ్యం: డాట్ సూచనను తిరస్కరించిన ఐసీఏ
ప్రస్తుతం చెలామణిలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో 'ప్యానిక్' బటన్ జోడించడం అసాధ్యమని ఇండియాలోని మొబైల్స్ తయారీ కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఇండియాలో 75 కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు ఉండగా, వాటన్నింటిలో, కష్టాల్లో ఆదుకునే ఒక బటన్ (ప్యానిక్ బటన్) ను జోడించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) మొబైల్ తయారీ సంస్థలకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త బటన్ ను జోడించడం అసాధ్యమని, అయితే, కొత్తగా తయారయ్యే ఫోన్లలో ఈ బటన్ ను జోడిస్తామని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) వెల్లడించింది. యాపిల్, శాంసంగ్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ సహా పలు కంపెనీలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయని ఐసీఏ అధ్యక్షుడు పంకజ్ మొహీంద్రో వ్యాఖ్యానించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా కనుగొన్న ఈ బటన్ ను వినియోగిస్తే, సమీపంలోని పోలీసు స్టేషన్లకు, దగ్గరి బంధువులకు, స్నేహితులకు సమాచారం వెళుతుంది. ఆపై జీపీఎస్ వ్యవస్థ ఆన్ అయి ఎక్కడ ఉన్నారన్న విషయం చేరుతుంది. ఈ బటన్ తప్పనిసరని గతంలో వెల్లడించిన డాట్, సెల్ ఫోన్ తయారీ సంస్థలకు ప్యానిక్ బటన్ ఉండాలని సూచించిందే తప్ప, ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు.